అమరావతి : జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పేదలపై 3 ఏళ్లుగా జగన్ రెడ్డి కక్ష సాధిస్తున్నారని ఫైర్ అయ్యారు. సంక్షేమం ఇస్తున్నాం కదా అని వారిపై మోయలేని భారం మోపుతున్నారని మండిపడ్డారు.
పేదలు, మధ్యతరగతి పై అధికంగా విద్యుత్ చార్జీలు పెంచి ధనవంతులపై భారం తగ్గించడం పిచ్చి తుగ్లక్ పాలన కాక మరేంటి ? అని ఫైర్ అయ్యారు. జగనన్న బాదుడే బాదుడు పథకం లో ప్రజలపై రూ.38వేల కోట్ల భారం మోపారని.. రాష్ట్రంలో బతకలేం అని పేదలు వలస పోయే దుస్థితి నెలకొందని మండిపడ్డారు.
సంక్షేమ పథకాలు పేదలకు ఎగ్గొట్టేందుకే వారిపై ఎక్కువ విద్యుత్ ఛార్జీల పెంపు భారం మోపారని.. జగన్ రెడ్డి అసమర్థత, అవినీతి వల్లే విద్యుత్ వ్యవస్థ గాడితప్పిందని అగ్రహించారు. ట్రూఅప్ పేరుతో త్వరలో మరో బాదుడుకు జగన్ సిద్ధమయ్యారని.. మద్యం, ఇసుక, గనులు, ఇతరత్రాల్లో వచ్చే కమీషన్లపై పెట్టిన శ్రద్ధ జగన్ పేదలపై పెట్టలేదని నిప్పులు చెరిగారు బోండా ఉమా.