కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు ప్రస్తుతం బూస్టర్ డోస్ ఇచ్చే పనిలో పడ్డాయి. తాజాగా అమెరికా కూడా తమ పౌరులకు బూస్టర్ డోసులు ఇచ్చేందకు సిద్ధం అయింది. ఇకపై 18 ఏళ్ల పైబడిన వారందరూ కరోనా టీకా బూస్టర్ డోసు తీసుకునేందుకు ఎఫ్ డీ ఐ అనుమతి ఇచ్చింది. మెడెర్నా, ఫైజర్ టీకా సంస్థలు ఈ విషయాన్ని ప్రకటించాయి. దీంతో రానున్న రోజుల్లో అమెరికా అంతటా బూస్టర్ డోసులు వేయనున్నారు. ఇప్పటికే 10 రాష్ట్రాల్లో పౌరులకు బూస్టర్ డోసులను ఇప్పటికే ప్రారంభించింది. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో వృద్ధులకు, కరోనా ముప్పు అధికంగా ఉన్న వారికి, దీర్ఘకాలిక రోగులకు బూస్టర్ డోసు ఇప్పటికే ఇస్తున్నారు. ఎఫ్డీఏ ఇప్పుడు 18 ఏళ్లు నిండిన వారందరికీ దీన్ని విస్తరింపజేసింది. తాజా నిర్ణయంతో అమెరికా అంతటా కరోనా కట్టడికి బూస్టర్ డోసులను ఇవ్వనున్నారు. క్రిస్మస్ దగ్గర పడుతున్న సందర్భంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కరోనా కట్టడికి బూస్టర్ డోసులు వేయడమే సరైన మార్గంగా పలు దేశాలు ఆలోచన చేస్తున్నాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తిని మరింత పెంచవచ్చని భావిస్తున్నాయి. అమెరికాలో ఫైజర్, మోడర్నా టీకాలను ఇప్పటికే కోట్ల మందికి ఇచ్చారు. జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు కూడా ఆమోదం లభించింది.
ఇది వరకు ఓ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మరో కంపెనీ టీకా తీసుకోవచ్చా..? అనే సందేహాలు ఉండేవి. అయితే ప్రస్తుతం బూస్టర్ డోసుగా వేరే కంపెనీకి చెందిన, నచ్చిన వ్యాక్సిన్ కూడా తీసుకోవచ్చని ఎఫ్ డీ ఐ తెలిపింది. అమెరికాలో ఇకపై ఫైజర్, మోడెర్నా రెండు డోసులు తీసుకున్నవారు 6 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకొవచ్చు. వారికి నచ్చిన టీకాను ఎంపిక చేసుకోవచ్చు. జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు తీసుకున్న వారు కనీసం రెండు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది.