షాకింగ్.. పబ్‌జి ఆడొద్దన్నందుకు ఆ బాలుడు కిడ్నాప్ డ్రామా ఆడాడు..!

-

పబ్‌జి మొబైల్ గేమ్ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. విద్యార్థులు, యువత ఆ గేమ్ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలను మనం అనేకం చూశాం. అయినప్పటికీ ఆ గేమ్‌ను ఆడడం మానడం లేదు.

పబ్‌జి మొబైల్ గేమ్ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. విద్యార్థులు, యువత ఆ గేమ్ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలను మనం అనేకం చూశాం. అయినప్పటికీ ఆ గేమ్‌ను ఆడడం మానడం లేదు. హైదరాబాద్‌లో తాజాగా పబ్‌జి గేమ్ ఎఫెక్ట్‌కు చెందిన మరొక సంఘటన చోటు చేసుకుంది. తనను ఆ గేమ్ ఆడనివ్వకుండా ఫోన్ లాక్కున్నారని చెప్పి ఓ బాలుడు ఏకంగా తాను కిడ్నాప్ అయ్యానని డ్రామా ఆడాడు. చివరకు పోలీసులు ఆ బాలున్ని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.

హైదరాబాద్‌లోని రాయదుర్గం శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉండే 16 ఏళ్ల అర్మాన్ హుస్సేన్ గత ఏప్రిల్‌లో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 9.8 జీపీఏ సాధించి సత్తా చాటాడు. అతను ఐఐటీ-జేఈఈ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే పబ్‌జి మొబైల్ గేమ్‌ను ఆడడం అలవాటు చేసుకోవడంతో అతను ఆ గేమ్‌కు బానిస అయ్యాడు. అది గమనించిన అతని తల్లిదండ్రులు అతని వద్ద ఉన్న ఫోన్‌ను లాక్కుని బుద్ధిగా చదువుకోవాలని చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన హుస్సేన్ ఇంట్లో నుంచి రూ.2 వేలు తీసుకుని ఎవరికీ చెప్పా పెట్టుకుండా బయటకు వెళ్లిపోయాడు.

అలా బయటకు వెళ్లిన హుస్సేన్ దారిలో ఓ వ్యక్తి నుంచి ఫోన్ తీసుకుని గొంతు మార్చి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. తాను కిడ్నాపర్‌నని చెబుతూ.. రూ.3 లక్షలు ఇస్తే మీ కొడుకును విడిచిపెడతానని మాట్లాడాడు. దీంతో ఆ విషయం నిజమేనని నమ్మిన అతని తల్లిదండ్రులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ తరువాత అతను హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తన తాత ఉండే మాచర్ల అనే ప్రాంతానికి వెళ్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అతన్ని హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్‌స్టాండ్‌లో పట్టుకున్నారు. అనంతరం హుస్సేన్‌కు పోలీసులు క్లాస్ పీకి ఇంటికి పంపించారు. ఏది ఏమైనా.. పబ్‌జి గేమ్ మాత్రం ఇలాంటి చాలా మందిని వ్యసనపరులుగా మారుస్తోంది. ఇంకా ఎలాంటి ఎన్ని ఘటనలు చూడాల్సి వస్తుందో కదా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version