ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఇప్పుడు అధికార వైసీపీకి చుక్కలు చూపిస్తుంది. వికేంద్రీకరణ బిల్లుని మండలిలో ప్రవేశ పెట్టగా అక్కడ వైఎస్ జగన్ సర్కార్ కి షాక్ తగిలింది. ఏ విధంగా చూసినా సరే మండలిలో ఆమోదం పొందే అవకాశాలు కనపడటం లేదు. ఇప్పటికే మూడు సార్లు సభను వాయిదా వేసారు చైర్మన్ షరీఫ్. అధికార విపక్షాలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో సభను వాయిదా వేసారు.
ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మండలిని రద్దు చేసే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందనే ప్రచారం జరుగుతుంది. దీనిపై మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు నారా లోకేష్, యనమల రామకృష్ణుడు స్పందించారు. మండలిని రద్దు చేయడం అంటే అంత చిన్న విషయం కాదని స్పష్టం చేసారు. ప్రభుత్వం తీర్మానం మాత్రమే చేస్తుందని శాసన సభలో ఆమోదం పొందగా,
పార్లమెంట్ లో ఆమోదం పొందాలి అంటే కనీసం ఏడాది పడుతుందని అన్నారు. కౌన్సిల్ రద్దు చెయ్యాలి అంటే చాలా ప్రక్రియ ఉందన్నారు. మండలి రద్దు చేస్తామంటే భయపడే పరిస్థితి లేదని, అసలు మండలి రద్దు చేసే అధికారం మీకు ఎక్కడిది అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చ అంటే ప్రభుత్వం రద్దు అంటుందని, తాము కూడా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగలమని ఆయన స్పష్టం చేసారు.