మీరు తరచుగా శ్వాస సమస్యలు లేదా దగ్గు, ఉబ్బసం వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని మందులు వాడినా ఉపశమనం దొరకడం లేదా? అయితే కేవలం రోజుకు 10 నిమిషాలు కేటాయించి, మీ శ్వాస వ్యవస్థను మెరుగుపరుచుకునే ఒక అద్భుతమైన మార్గం ఉంది. అదే మన ప్రాచీన యోగ శాస్త్రంలో చెప్పబడిన శంఖ ముద్ర. ఈ ముద్రను ఎలా వేయాలి? ఇది మీ ఊపిరితిత్తులకు, గొంతుకు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం..
మన పూర్వీకులు అందించిన యోగ విద్యలో, కేవలం చేతి వేళ్లను కలిపి ఉంచడం ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందే ప్రక్రియే ముద్రలు. వాటిలో ఒకటి శంఖ ముద్ర, దీని ఆకారం శంఖం (Conch Shell) వలె ఉంటుంది. శంఖం యొక్క ధ్వని పవిత్రంగా ఎలా భావించబడుతుందో, ఈ ముద్ర కూడా మన శరీరంలోని శబ్ద తత్వాన్ని (గళం) శుద్ధి చేస్తుంది.

శంఖ ముద్ర వేసే విధానం: ఈ ముద్రను వేయడం చాలా సులభం దీన్ని ఎవరైనా, ఎప్పుడైనా వేయవచ్చు. కుడి చేతి బొటనవేలును ఎడమ అరచేతి మధ్యలో ఉంచండి. ఇప్పుడు ఎడమ చేతి నాలుగు వేళ్లతో కుడి బొటనవేలును గట్టిగా చుట్టండి. కుడి చేతి నాలుగు వేళ్లను నిటారుగా ఉంచి ఆ నాలుగు వేళ్లకు ఆనుకుని ఎడమ చేతి బొటనవేలు కొనను తాకించండి. మీ రెండు చేతులు కలిపి చూస్తే, అది సరిగ్గా శంఖం ఆకారంలో కనిపిస్తుంది. ఈ ముద్రను వేసి, 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి.
ఆరోగ్య ప్రయోజనాలు: శంఖ ముద్ర ప్రధానంగా గళం (గొంతు) మరియు శ్వాస వ్యవస్థపై పనిచేస్తుంది.
శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం ఇది అలర్జీలు, ఆస్తమా బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. గొంతు, స్వర నాళాలు ముఖ్యంగా పాటలు పాడేవారు, ఉపాధ్యాయులు లేదా గొంతు ఎక్కువగా ఉపయోగించే వారికి ఇది అద్భుతమైనది. ఇది స్వర పేటికను శుద్ధి చేసి గొంతు బొంగురు పోవడాన్ని తగ్గిస్తుంది.
మానసిక ప్రశాంతత: ముద్ర వేసి కూర్చున్నప్పుడు చేసే లోతైన శ్వాస, మనసుకు శాంతిని ఇచ్చి ఒత్తిడిని తగ్గిస్తుంది. శంఖ ముద్ర కేవలం శ్వాస సమస్యలకు మాత్రమే కాదు మీ స్వరాన్ని స్పష్టంగా మధురంగా మార్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. రోజుకు 10 నిమిషాలు, ప్రశాంతమైన వాతావరణంలో ఈ ముద్రను సాధన చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
గమనిక: ఈ ముద్రను వేసేటప్పుడు నేలపై చాప లేదా దుప్పటి వేసుకుని, వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవడం ఉత్తమం. వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా కాకుండా సహాయక సాధనంగా మాత్రమే దీనిని ఉపయోగించాలి.