ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దేశపతి శ్రీనివాస్, కె.నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ సూచనల మేరకు ఈ ఉదయం 11 గంటలకు నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఏడాదితో శాసనమండలిలో గాంగాధర్ గౌడ్, నవీన్ కుమార్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ కాలం ముగుస్తుండడంతో..ఎమ్మెల్యే కోటాలో ఎన్నికకు ఫిబ్రవరి 27న నోటిఫికేషన్ విడుదలైంది.
నేటి నుంచి మార్చి 13 వరకు ఈ ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ స్వీకరించిన నామినేషన్లను 14వ తేదీన పరిశీలించనున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఈ నెల 16వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఉపసంహరించుకున్న నామినేషన్ల తర్వాత వారం రోజుల సమయంలో మార్చి 23 న ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి.. అదే రోజు ఓట్లు లెక్కించనున్నారు.