రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని, వారి సమస్యలపై ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏ మార్చడం, మోసం చేయడం అని అన్నారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా కాంగ్రెస్ మాట నిలుపుకునే వరకు ఆర్ఆర్ఆర్ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.
శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మాజీమంత్రి హరీశ్ రావును ఆర్ఆర్ఆర్ బాధితులు, రైతులు కలిశారు. ట్రిపుల్ ఆర్ విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నాయకులు మాట మారుస్తున్నారని బాధితులు హరీశ్ రావు ఎదుట తమ గోడును వెల్లబోసుకున్నారు. సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని, ఇచ్చిన మాట తప్పి నిబంధనలకు విరుద్ధంగా సర్వేలు చేస్తూ భూసేకరణ పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారని వాపోయారు. భూసేకరణ చట్టానికి విరుద్ధంగా తక్కువ ధరకే భూములు లాక్కునే కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై హరీశ్ రావు స్పందిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బాధితులు భరోసానిచ్చారు.