ఆ రెడ్డి గారు మ‌రో జంపింగ్‌కు రెడీ..!

-

మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరో జంప్ చేస్తున్నారు. కొద్దికాలంగా టీడీపీ వైపు ఉంటున్న బైరెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు. గ‌త కొన్నేళ్లుగా ఆయ‌న ఎలాంటి రాజ‌కీయ ల‌క్ష్యం లేకుండా రాజ‌కీయాల్లో ఉండ‌డంతో పూర్తిగా వెన‌క‌ప‌డిపోయారు. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు ఆయ‌న బీజేపీలో చేరుతున్న‌ట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరే అంశంపై అనుచరులతో చర్చించేందుకు ఈనెల 24న స‌మావేశం ఏర్పాటు చేశారు.

ఇక ఇప్ప‌టికే ప‌లు పార్టీలు మార‌డంతో పాటు కొత్త పార్టీ కూడా పెట్టిన బైరెడ్డికి ఏదీ క‌లిసి రాక‌పోవ‌డంతో ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, అమరావతి ఫ్రీజోన్ వంటి డిమాండ్లకు బీజేపీ కూడా సానుకూలంగా ఉన్నందున సీమ అభివృద్దే లక్ష్యంగా బీజేపీలో చేరుతున్నట్టు బైరెడ్డి చెబుతున్నారు. ఇక గ‌తంలో టీడీపీలో కొన‌సాగి.. ప‌లు పార్టీలు మారి.. చివ‌ర‌కు సొంత పార్టీ పెట్టి తిరిగి ఇప్పుడు టీడీపీలో ఉన్న‌ట్టు లేన‌ట్టు ఉన్న బైరెడ్డికి చివ‌ర‌కు ఇప్పుడు బీజేపీయే దిక్క‌య్యింది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇక టీడీపీ కోలుకోవడం అయ్యేపని కాదని ఆ పార్టీ నేత‌లంద‌రూ ఏకాభిప్రాయానికి వ‌చ్చేశారు. ఇప్పుడు ఆ పార్టీలో ఉంటే ఉప‌యోగం లేద‌నే బైరెడ్డి డిసైడ్ అయ్యాడు. ఇక బైరెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానం విష‌యానికి వ‌స్తే గతంలో బైరెడ్డి కుటుంబం కాంగ్రెస్‌లో ఉండేది. టీడీపీ వచ్చాక ఆ పార్టీలో చేరింది. రెండు సార్లు బైరెడ్డి నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆ త‌ర్వాత ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటుచేశారు. ఆ తర్వాత స్పందన లేకపోవడంతో దాన్ని మూసేశారు. కాంగ్రెస్‌లో చేరారు. ఇక ఈ యేడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీకి మ‌ద్ద‌తు ప‌లికారు. మ‌ధ్య‌లో చంద్ర‌బాబుతో తీవ్ర‌మైన విబేధాలు వ‌చ్చినా మ‌ళ్లీ బైరెడ్డి ఆయ‌న చెంత‌కే చేరిపోయారు. స్థానికంగా బైరెడ్డి ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version