విన్న విమర్శలే విని విని విన్నవారికి విసుగొస్తుంది కానీ.. ఈ విమర్శలు చేస్తున్నవారికి కొంచెమైనా బోర్ కొట్టడం లేదా ? పార్టీ పదవిలో ఉన్నాం కదా.. ఏదో పార్టీ ఇచ్చిన గైడ్‌లైన్ ప్రకారం ప్రెస్‌మీట్ పెట్టాలి కనుక పెట్టాము.. ఏదో నాలుగు తిట్టాం కనుక తిట్టాలి.. అనే పద్దతిలో ఉంది ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం. ఏపీలో బీజేపీ ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ వ్యవహరం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. కన్నా నామమాత్రంగానే విమర్శలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నాడనే ఆలోచనలో పార్టీ అధిష్టానం, ప్రజలు అనుమానిస్తున్నారు.
అంతే కాదు.. ఇటీవల కన్నా ఎక్కువగా టీడీపీపై విమర్శలు సంధిస్తున్నారు. ఎందుకు అనేది ఇక్కడ అంతుబట్టకుండా ఉన్నప్పటికి, టీడీపీతో ఎక్కడ బీజేపీ పొత్త పెట్టుకుంటుందో ? అనే భయంతో కన్నా ఉన్నట్లు కనపడుతోంది. అందుకే టీడీపీకీ తలుపులు మూసేశాం.. ప్రధాని మోడీ గొళ్ళెం పెడితే, అమిత్ షా పెద్ద తాళం వేశారు అని కన్నా లక్ష్మీనారాయణ పదే పదే చెప్పడంపై రకరకాల సందేహాలు వస్తున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ చేస్తున్న విమర్శలతో ఏపీలో ఏమైనా బీజేపీకి లాభం జరుగుతుందా ? అంటే ఏమీ లేదనే చెప్పాలి. వాస్తవానికి బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైనా, ప్రభుత్వ నిర్లక్ష్యంపైనా విమర్శలు చేయాలి.
ఇప్పుడు ఏపీలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది దీనిపై కన్నా లక్ష్మీనారాయణ స్పందించడం లేదు. ఇకపోతే విద్యుత్ కోతలు అధికంగా ఉన్నాయి. వీటిపై బీజేపీ ఎలాంటి కార్యాచరణ ప్రకటించడం లేదు.. అంతే కాదు.. ఉద్యమాలు చేయడం, ప్రజలను కదిలించడం, ప్రభుత్వంను ఇరుకున పెట్టే పనులకు పూనుకోవడం లేదు. ఇక టీడీపీతో దోస్తీ కడితే బీజేపీ నేతగా తనకు పట్టు ఉండదని భావించిన కన్నా లక్ష్మీనారాయణ ప్రతిపక్ష టీడీపీ పైనే విమర్శలు చేస్తున్నారనే అపవాదు ఉంది. అసలే ఏపీలో బీజేపీ బలోపేతంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రతిపక్ష నేతలను, పార్టీని విమర్శిస్తే బీజేపీ బలోపేతం అవ్వడం అటుంచి… ఉన్న పార్టీ కాస్త వీక్ కావడం ఖాయం.
బీజేపీకి ఏపీలో ఉన్న బలం కేవలం టీడీపీ నుంచి వలస వచ్చిన ఆ నలుగురు ఎంపీలే ప్రధాన బలం.. వారు ఎప్పుడైనా చంద్రబాబు నీడగానే ఉంటారు తప్పితే.. బీజేపీలో ఉండలేరు.. ఇముడలేరు.. అందుకే వారు ఎప్పుడు టీడీపీని ఎలా కాపాడాలా అనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఆ నలుగురు ఎంపీలు తమ వ్యక్తిగత ప్రయోజనాలకు తప్పితే పార్టీ బలోపేతం కోసం పట్టించుకోరు.. ఇది జగమెరిగిన సత్యం. మరి కన్నాఈ విషయాన్ని మరిచారా.. పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం మానుకుని, ప్రభుత్వ వైఫల్యాను ఎండగడితే పార్టీకి పుట్టగతులు ఉంటాయి.. లేకుంటే పుట్టిమునగడం ఖాయం.. అందుకే కాస్త మారండి కన్నా అంటున్నారు బీజేపీ శ్రేణులు.