మాజీ సీఎం అల్లుడు, కేఫ్ కాఫీ డే ఓనర్ సిద్ధార్థ మిస్సింగ్..!

-

కేఫ్ కాఫీ డే ఫౌండర్, కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యం కలకలం రేపుతోంది. సోమవారం సాయంత్రం నుంచి సిద్ధార్థ కనిపించకుండా పోవడంతో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.

కేఫ్ కాఫీ డే ఫౌండర్, కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యం కలకలం రేపుతోంది. సోమవారం సాయంత్రం నుంచి సిద్ధార్థ కనిపించకుండా పోవడంతో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. బెంగళూరుకు సుమారుగా 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళూరుకు సమీపంలోని నేత్రావతి నది బ్రిడ్జిపై సిద్ధార్థ సోమవారం సాయంత్రం సమయంలో కారు దిగి ఎటో నడుచుకుంటూ పోయారట. అనంతరం ఆయన మళ్లీ కనిపించలేదట. దీంతో కారులో ఉన్న డ్రైవర్ ఆయన ఎంతకీ రావడం లేదని గమనించి దిగి చూసే సరికి సిద్ధార్థ ఎక్కడా కనిపించలేదు. ఆయన కోసం డ్రైవర్ చుట్టూ వెదికినా ఆయన జాడ తెలియలేదు. దీంతో ఆ డ్రైవర్.. సిద్ధార్థ కుటుంబ సభ్యులతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాగా వీజీ సిద్ధార్థ అదృశ్యం విషయం తెలుసుకున్న దక్షిణ కర్ణాటక పోలీసులు ఆయనను గాలిస్తూ విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయినప్పటికీ సిద్ధార్థ జాడ ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. అయితే కారు దిగి వెళ్లిపోయినప్పుడు సిద్ధార్థ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడని డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ కోణంలోనూ పోలీసులు మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరోవైపు సిద్ధార్థ మిస్సింగ్ వార్త అటు కర్ణాటకలోనే కాక.. ఇటు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఈ క్రమంలో ఎస్‌ఎం కృష్ణ ఇంటికి సిద్ధార్థ బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున చేరుకుంటుండడం జనాలకు మరింత ఉత్కంఠను కలిగిస్తోంది.

వీజీ సిద్ధార్థ 1990లో బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్‌లో మొదటి కేఫ్ కాఫీ డే స్టోర్‌ను ఏర్పాటు చేశారు. అనతి కాలంలోనే కేఫ్ కాఫీ డేకు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే అందులో ప్రస్తుతం 10వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక సిద్ధార్థ చక్కని వ్యాపారవేత్తగానే కాక, గొప్ప సామాజిక కార్యకర్తగా పేరుగాంచారు. ఆయన అనేక సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటుంటారు. అలాగే కేఫ్ కాఫీ డేలో పనిచేసే ఎంతో మంది ఉద్యోగులను ఆయన స్వయంగా ఆదుకున్నారు. ఇక సిద్ధార్థ ఎస్‌ఎం కృష్ణ కూతురు మాళవికను వివాహం చేసుకోగా.. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. ప్రస్తుతం సిద్ధార్థ మిస్సింగ్ వార్త కర్ణాటకలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version