డయాబెటిస్ ఉన్నవారు డైట్‌లో, జీవనవిధానంలో మార్పులు చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుందని, దాని వల్ల ఇతర సమస్యలు రాకుండా ఉంటాయని చెబుతారు. ఈ క్రమంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు అన్నింటినీ పూర్తిగా తినడం మానేస్తుంటారు. కొవ్వు పదార్థాలు, పిండిపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను పూర్తిగా మానేస్తారు. కానీ నిజానికి అలా చేయాల్సిన పనిలేదు.
డయాబెటిస్ నియంత్రణలో ఉన్నవారు ఏ ఆహారాన్ని అయినా సరే మితంగా తీసుకోవాలి. అంటే తక్కువ మోతాదులో తీసుకోవాలి. దీని వల్ల ఎలాంటి సమస్యలు రావు. ఇక డయాబెటిస్ ఉన్నవారు మాంసం తినవచ్చా.. అంటే.. తినవచ్చు. కానీ దాన్ని కూడా కొద్దిగానే తీసుకోవడం ఉత్తమం. అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ చెబుతున్న ప్రకారం డయాబెటిస్ ఉన్నవారు మటన్‌ను పూర్తిగా మానేస్తే మంచిది. ఎందుకంటే అందులో శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది అస్సలు మంచిది కాదు. దీని వల్ల డయాబెటిస్ లేని వారిలో ఆ వ్యాధి వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక డయాబెటిస్ ఉన్నవారికి హార్ట్ స్ట్రోక్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అధిక బరువు పెరుగుతారు. కొలెస్ట్రాల్ ఎక్కువవుతుంది.
అయితే సదరు ఇనిస్టిట్యూట్ చెప్పినప్పటికీ మటన్‌ను పరిమితంగా తీసుకుంటే ఏమీ కాదని, డయాబెటిస్ నియంత్రణలో ఉన్నవారు అందుకు కంగారు పడాల్సిన పనిలేదని వైద్య నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ భయం చెందే వారు మటన్‌కు బదులుగా చికెన్, చేపలను తినవచ్చని, వాటిల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది కనుక నిర్భయంగా వాటిని తీసుకోవచ్చని సూచిస్తున్నారు.