అద్భుతం.. కాలువ‌ల‌పై సోలార్ ప్లాంట్ల ఏర్పాటు.. స‌త్ఫ‌లితాల‌ను ఇస్తున్న కార్య‌క్ర‌మం..!

-

మ‌న దేశంలో రోజు రోజుకీ జ‌నాభా విప‌రీతంగా పెరిగిపోతోంది. పెరుగుతున్న జ‌నాభాకు అనుగుణంగా స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డం ప్ర‌భుత్వాల‌కు స‌వాల్‌గా మారింది. తాగునీరు, విద్యుత్ వంటి స‌దుపాయాల‌ను అందివ్వ‌డం క‌ష్టమ‌వుతోంది. మ‌రోవైపు సోలార్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేద్దామంటే స్థ‌ల సేక‌ర‌ణ ఇబ్బందిగా మారింది. కానీ గుజ‌రాత్ ప్రభుత్వం ఒక‌ప్పుడు అందిపుచ్చుకున్న ఓ మోడ‌ల్ ఇప్పుడు ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంది.

సోలార్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున స్థ‌లం కావాలి. కానీ కాలువ‌ల‌పై ఆ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయ‌డం చాలా తేలిక‌. స్థ‌లం ఇబ్బంది ఉండ‌దు. కాలువలు ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక పెద్ద ఎత్తున సౌర విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చు. స‌రిగ్గా ఇలా ఆలోచించింది కాబ‌ట్టే 2011లోనే గుజ‌రాత్ ప్ర‌భుత్వం కెనాల్ టాప్ సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి పూనుకుంది. కాలువ‌ల‌పై 1 కిలోమీట‌రు పొడ‌వు మేర సోలార్ ప్యానెల్స్‌, ఇత‌ర ప‌రిక‌రాల‌ను ఏర్పాటు చేసి 2-3 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేస్తారు. గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో ఉన్న చంద్రాస‌న్ గ్రామంలో స‌నంద్ బ్రాంచ్ కాలువ‌పై 750 మీట‌ర్ల పొడ‌వున ఉన్న కెనాల్ మీద 1 మెగావాట్ సామ‌ర్థ్యం ఉన్న అలాంటి కెనాల్ టాప్ సోలార్ ప్లాంట్‌ను మొద‌ట‌గా నిర్మించారు. అది స‌త్ఫ‌లితాల‌ను ఇవ్వ‌డంతో గుజ‌రాత్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం అలాంటి 35 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల‌ను నిర్మించారు.

కాలువ‌ల‌పై సోలార్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల పెద్ద ఎత్తున స్థ‌లం ఆదా అవుతుంది. అలాగే కాలువ మీద ప్యానెల్స్ రక్ష‌ణగా ఉంటాయి క‌నుక కాలువ‌లోని నీరు ఎక్కువ‌గా ఆవిరి అవ‌దు. నీరు కూడా ఆదా అవుతుంది. ఈ క్ర‌మంలోనే ఇత‌ర రాష్ట్రాలు కూడా ఈ మోడ‌ల్‌లో సోలార్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తున్నాయి.

ఈ కెనాల్ టాప్ సోలార్ ప్లాంట్‌ను కాలువ‌పై ఒక కిలోమీట‌ర్ కు ఒక‌టి చొప్పున నిర్మించ వ‌చ్చు. దీంతో 2-3 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్ప‌త్తి అవుతుంది. ఒక ప్లాంట్ ఏర్పాటుకు సుమారుగా రూ.1.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంది. ఈ క్ర‌మంలోనే ఏపీ, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ బెంగాల్‌ల‌లో ఇలాంటి ప్లాంట్ల‌ను ఏర్పాటు చేశారు. మార్చి 31, 2019 వ‌ర‌కు మొత్తం 50 మెగావాట్ల కెనాల్ బ్యాంక్ సోలార్ పీవీ ప్లాంట్లు, 44 మెగావాట్ల కెనాల్ టాప్ సోలార్ ప్లాంట్ల‌ను నిర్మించారు. త్వ‌ర‌లోనే దేశ వ్యాప్తంగా ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఈ త‌ర‌హాలో ప్లాంట్ల నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. దీంతో విద్యుత్ స‌మ‌స్య తీర‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version