హిజ్రాలు అంటే సమాజంలో అందరికీ చిన్న చూపే ఉంటుంది. వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతారని, పురుషులను భయ భ్రాంతులకు గురి చేసి బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తారని భావిస్తారు. అయితే చాలా మంది హిజ్రాలు సమాజంలో అలాగే ఉన్నారు. కానీ కొందరు మాత్రం జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అలాంటి హిజ్రాల్లో ఆమె ఒకరు. ఆమే.. ముంబైకి చెందిన జోయా థామస్ లోబో. ఇప్పుడు ఫోటో జర్నలిస్టు అయ్యింది.
జోయా ఒక హిజ్రా. 5 ఏళ్ల వయస్సులో స్కూల్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. తరువాత తండ్రి చనిపోయాడు. తల్లి లాలనలో పెరిగింది. ఆమెకు 17 ఏళ్ల వయస్సులో తాను హిజ్రా అని గుర్తించింది. దీంతో సల్మా అనే మహిళ నడుపుతున్న హిజ్రా గ్రూప్‌లో చేరింది. తరువాత రైళ్లలో బిచ్చమెత్తుకుంది. పండుగ రోజుల్లో రైళ్లలో వారికి రోజుకు రూ.500 నుంచి రూ.800 వచ్చేవి. కానీ మిగిలిన రోజుల్లో తినడానికి తిండి దొరికేది కాదు. అయినప్పటికీ ఆమె పైసా పైసా పోగు చేసి సల్మా సహకారంతో 2020లో ఫొటో జర్నలిస్టుగా మారింది.
ఆ తరువాత జోయా ఓ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. రైళ్లలో రోజూ యాచకం ద్వారా వచ్చే డబ్బును పోగు చేసి రూ.30వేలతో ఓ సెకండ్ హ్యాండ్ కెమెరాను కొనుగోలు చేసింది. దాంతో వీడియోలు తీస్తూ వాటిని యూట్యూబ్‌లో పోస్టు చేయసాగింది. వాటికి లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఆమె శ్రమకు తగిన గుర్తింపు లభించింది. ఆమెకు ఓ మీడియా ఏజెన్సీ వారు ఫొటో జర్నలిస్టు జాబ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తుంది.
పాత వృత్తిని మానేయడంతో ఇప్పుడామె రోజూ ఉదయాన్నే లేచి కెమెరా తీసుకుని రోజంతా ఫొటోలు తీసి సాయంత్రానికి ఆఫీసులో వాటిని అందజేసి విధులు నిర్వర్తిస్తోంది. మనం ఎలా జన్మించామని కాదు, ఏం చేస్తున్నామనేది ముఖ్యమని ఆమె చెబుతోంది. ప్రతి ఒక్కరూ తమకంటూ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని సాకారం చేసుకునేందుకు శ్రమిస్తే తప్పక విజయం సాధిస్తారని చెబుతోంది.