మునుగోడు బరిలో టీడీపీ? అభ్యర్ధి ఫిక్స్?

-

తెలంగాణలో టీడీపీ ఉనికి లేదనే సంగతి తెలిసిందే…ఏదో పేరుకు మాత్రమే పార్టీ ఉంది గాని…సంస్థాగతంగా అంటూ ఆ పార్టీకి బలం పోయింది. ఆ పార్టీ బలమంతా ఎక్కువ టీఆర్ఎస్ వైపుకు వెళ్ళగా, కొంచెం కాంగ్రెస్ వైపుకు వచ్చింది. ఏదో గత ఎన్నికల్లో రెండు సీట్లు అయిన గెలుచుకుంది గాని…ఇప్పుడు ఒక సర్పంచ్ స్థానాన్ని గెలుచుకునే బలం టీడీపీకి లేదు. పైగా తెలంగాణలో టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్యే పోరు నడుస్తోంది.

ఇలాంటి తరుణంలో రాజకీయంగా టీడీపీకి స్పేస్ లేదు. కాకపోతే తెలంగాణలో టీడీపీని అభిమానించే వారు ఇంకా ఉన్నారు..వారు టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయారు. ఒకవేళ టీడీపీ మళ్ళీ యాక్టివ్ అయ్యి…దూకుడుగా రాజకీయం చేస్తే ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉంది…కానీ అలా టీడీపీలో దూకుడుగా పనిచేసే నేతలు లేరు.  అయితే ఇటీవల చంద్రబాబు ఉమ్మడి ఖమ్మం జిల్లా వచ్చినప్పుడు…ఆయన పర్యటనలో ప్రజలు పెద్ద ఎత్తున కనిపించారు. దీని బట్టి చూస్తే కొందరు ప్రజల్లో టీడీపీ అంటే అభిమానం ఉందని చెప్పొచ్చు.

అయితే సరైన నాయకత్వం లేక టీడీపీకి ఆదరణ లేకుండా పోయింది…ఇలాంటి తరుణంలో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కానీ ఇది అంత తేలికగా అయ్యే అంశం కాదు…కాకపోతే తమ శక్తి ఏ మేర ఉందో తెలుసుకోవడానికి…మునుగోడులో టీడీపీ అభ్యర్ధిని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

మునుగోడులో బీసీ వర్గం ఓట్లు ఎక్కువ…ఇప్పటికీ బీసీలకు టీడీపీపై అభిమానం ఉందని అనుకుంటున్నారు…అందుకే అక్కడ పోటీ చేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారట. దీనికి చంద్రబాబు కూడా ఒప్పుకున్నారని సమాచారం. టీడీపీ తరుపున బరిలో దిగేందుకు…టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..మునుగోడు ఇంచార్జ్ జక్కలి  ఐలయ్య యాదవ్ సిద్ధమవుతున్నారట. బీసీ వర్గానికి చెందిన ఐలయ్యకు…నియోజకవర్గంలో కాస్త పట్టు ఉందని తెలుస్తోంది. దీంతో ఆయన పోటీకి రెడీ అవుతున్నారట. చూడాలి మరి మునుగోడు బరిలో టీడీపీ ఉంటుందో లేదో?

Read more RELATED
Recommended to you

Exit mobile version