నిర్లక్ష్యమైన డ్రైవింగ్ మరోకరి ప్రాణాలను బలిగొంటుంది. ఇలాంటి ఘటనే మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలో ఓ కారు శనివారం వేకువజామున బీభత్సం సృష్టించింది. ఉదయాన రోడ్లు శుభ్రం చేసేందుకు వచ్చిన పారిశుద్ధ్య సిబ్బందిపైకి కారు దూసుకెళ్లింది. దాంతో ఇద్దరు కార్మికులు మృత్యువాత పడగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మెదక్ పట్టణంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద జరిగింది. శనివారం తెల్లవారు జామున 5 గంటలకు పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు ఊడ్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో రాందాస్ చౌరస్తా నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆల్టో కారు (నంబర్ టీఎస్35 ఎఫ్ 9766) వారిని ఢీకొట్టింది. కారు బలంగా ఢీ కొట్టడంతో దాయర వీధికి చెందిన నర్సమ్మ అక్కడికిక్కడే దుర్మరణం చెందింది. చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ యాదమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో ముగ్గురు కార్మికులు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న మెదక్ డీఎస్పీ సైదులు, పట్టణ సీఐ మధు, రూరల్ సీఐ విజయ్ కుమార్, ఎస్‌ఐలు మల్లారెడ్డి, విఠల్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఒకేసారి ఇద్దరు మున్సిపల్ కార్మికులు చనిపోవడంతో మెదక్ మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కార్మికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని కార్మికులు పోలీసులను కోరారు. ప్రమాదానికి కారణమైన కార్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.