తెలంగాణలో నేటి నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. 75 ప్రశ్నలను ఎన్యుమరేటర్లు ఒక్కో కుటుంబాన్ని అడిగి వివరాలు సేకరించనున్నారు. ఈ బాధ్యతలను ప్రైమరీ స్కూల్ టీచర్లకు అప్పగించడంతో కులగణన సర్వే పూర్తయ్యే వరకు రాష్ట్రంలోని ప్రైమరీ స్కూళ్లలో మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పాఠాలు చెప్పనున్నారు.
అనంతరం టీచర్లు కులగణనలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి రాష్ట్రంలో ఒక్కపూట బడులు నడవనన్నాయి. దీనిపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ.. ఒంటిపూట బడులు నిర్వహించొద్దన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కులగణన నుంచి ప్రభుత్వ స్కూల్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. టీచర్లను కులసర్వేలో ఉపయోగించడం అంటే విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ సర్వే కోసం స్కూళ్లను మధ్యాహ్నం వరకు నడపడం సరికాదన్నారు. కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంతో పిల్లల భవిష్యత్ ఆగం అవుతుందన్నారు.