ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు ఏదో ఒక మలుపు తిరుగుతూనే ఉంది. దాదాపు 12 ఏళ్లు కావస్తున్నా కేసు కొలిక్కి రాకపోవడంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ రీపోస్టుమార్టంకు చెందిన CSFL రిపోర్ట్ సీబీఐ చేతికి అందింది. సీబీఐకి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ… నివేదిక అందించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ నివేదికలో పలు కొత్త అంశాలు బయటకు వచ్చాయి. ఈ నివేదికలో చనిపోయిన సమయంలో ఆయేషా వయసు 19 సంవత్సరాలని వెల్లడించారు. తల భాగంలోని ఉన్న ఎముకకు గాయమైనట్లు పేర్కొన్నారు. ఎముకలో ఉన్న షార్ప్ ఏడ్జ్‌లో బలంగా గాయమైనట్లు ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది. అయితే ఈకేసుకు సంబంధించి ఇంకా నిందితుల ఆచూకీ మాత్రం బయట పడలేదు.
కాగా, 2007 డిసెంబర్‌లో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఆయేషా మీరా దారుణహత్యకు గురైంది. అప్పట్నుంచీ ఈ కేసులో ప్రతీ మలుపు సంచలనంగా మారింది. చివరకు ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబును 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆయేషా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని తేలాడు కానీ… అసలు దోషులెవరో బయటపడలేదు. దీంతో దోషులెవరో తేల్చాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో ఆయేషా కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో దోషులు ఎవరన్నది తేలుతుందా అని ఆసక్తి నెలకొంది.