కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ధాన్యం కొనుగోలు పంచాయి తీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ధాన్యం కొనుగోళ్లపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు. రబీ సీజన్ లో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందని… బాయిల్డ్ రైస్ తీసుకుంటారా ? లేదా? చెప్పాలని కె.కేశవరావు కేంద్రాన్ని ప్రశ్నించారు.
బాయిల్డ్ రైస్ తీసుకుంటే ఎంత తీసుకుంటారు.. స్పష్టమైన ప్రకటన చేయండి అంటూ కేంద్రాన్ని నిలదీశారు కేకే.గత ఐదురోజుల నుంచి తెలంగాణ రైతుల గురించి ఆందోళన చేస్తున్నాం.. ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరుతున్నామన్నారు. అయితే కేకే ప్రశ్నపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ… తాము దీనిపై స్పష్టమైన ప్రకటన ఇప్పుడు చేయాబోమనీ… ఖరీఫ్ ధాన్యం కొనుగోలు తర్వాత రబీ సంగతి చూద్దాం అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో రాజ్యసభ గందరగోళంగా మారింది.