త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముంది. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు దీనిలో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29న ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే విస్తరణ చేపట్టవచ్చని సమాచారం. మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఒక్కొక్కరికి చోటుదక్కే అవకాశాలున్నాయి.
తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. వీరిలో జి.కిషన్‌రెడ్డి ఇప్పటికే కేబినెట్ మంత్రిగా ఉన్నారు. తెలంగాణపై భారీ ఆశలు పెట్టుకున్న బీజేపీ.. ఈ విడత మంత్రివర్గ విస్తరణలో మరొకరికి స్థానం కల్పించే అవకాశం ఉంది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, అర్వింద్, లక్ష్మణ్, సోయం బాపురావు తెలంగాణ నుంచి ఎంపీలుగా ఉన్నారు.
మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర మాత్రమే ఉండడం, ఇదే చివరి మంత్రివర్గ విస్తరణగా భావిస్తున్నందున ఈసారి ఒకరికి అవకాశం ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఏపీకి చెందిన సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు (యూపీ నుంచి) రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.