నకిలీ వార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్న సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానెళ్లపై వేటు వేస్తోంది. తాజాగా 8 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇందులో ఏడు భారత్‌కు చెందినవి కాగా.. ఒకటి పాకిస్థాన్‌కు చెందినదిగా కేంద్రం తెలిపింది. ఈ ఛానళ్లకు మొత్తగా 85లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీటిల్లో వచ్చిన వీడియోలను 114కోట్లకు పైగా మంది వీక్షించారు. దేశ భద్రత, విదేశీ వ్యవహారాలు, ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించిన అంశాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు గానూ, దేశంలో కొన్ని వర్గాల మధ్య ద్వేషం పెంచేలా వీడియోలు ప్రసారం చేస్తున్నందుకు గానూ ఈ ఛానళ్లను బ్లాక్ చేసినట్లు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తెలిపింది. భారత సాయుధ బలగాలు, జమ్మూకశ్మీర్‌కు వ్యతిరేకంగా ఈ ఛానళ్లు పలు నకిలీ వార్తలను ప్రసారం చేశాయని పేర్కొంది.