వాహనదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 15వ తేదీ వరకు ఫాస్టాగ్‌లను పొందేందుకు గడువును పెంచినట్లు కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ఏర్పడుతున్న రద్దీని తగ్గించేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 1వ తేదీ నుంచి ఫాస్టాగ్ విధానాన్ని కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఇదివరకు స్పష్టం చేసిన విషయం విదితమే. అయితే ఆ తేదీని కేంద్రం మార్చింది. దాన్ని 15వ తేదీ వరకు పొడిగించారు.
దేశవ్యాప్తంగా ఉన్నజాతీయ రహదారులపై కొనసాగుతున్న టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలనే నిర్ణయానికి మరింత గడువును పెంచినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఎంతో మంది ఫాస్టాగ్‌లను పొందినా, ఇంకా చాలా మంది ఫాస్టాగ్‌లను తీసుకోని కారణం చేత, వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫాస్టాగ్ విధానం అమలుకు గడువును మరింత పెంచినట్లు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు శుక్రవారం ఓ లేఖలో తెలిపింది. దీంతో కొత్త గడువు ప్రకారం ఆ విధానాన్ని అమలు చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.