బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో కీలక విషయం వెలుగుచూస్తుంది. ఇప్పటికే ఆయన తండ్రి కృష్ణకుమార్ సింగ్ పట్నా పోలీసులను ఆశ్రయించారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మరికొందరు స్నేహితులు మోసం, కుట్రకు పాల్పడటం ద్వారా సుశాంత్ ఆత్మహత్యకు కారణమయ్యారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే రియా చక్రవర్తి సుశాంత్ ఖాతా నుంచి రూ.15 కోట్లు మాయం చేసిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. పైగా ఇప్పటికే ఈ కేసు సీబీఐకి అప్పగించాలని చాలామంది కోరారు. సుశాంత్ సోదరి కూడా ప్రదాని మోడీకి లేఖ రాసింది.
ఈ పరిస్థితుల నేపధ్యంలో ఎట్టకేలకు కేసుపై సీబీఐ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ బిహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్రం అంగీకరించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసును పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఇకపోతే సుశాంత్ సింగ్ ముంబయిలోని బాంద్రా ప్రాంతంలోని తన ఇంట్లో జూన్ 14 న చనిపోయారు.