జమ్మూ కాశ్మీర్ నుంచి 10 వేల మంది పారామిలటరీ సిబ్బందిని ఉపసంహరించాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. ప్రస్తుతం అక్కడ అదనంగా 40 కంపెనీల సీఆర్పీఎఫ్, 20 సీఐఎస్ఎఫ్, 20 బీఎస్ఎఫ్, 20 సహస్ర సీమా బల్ దళాలు ఉన్నాయి. ఈ బలగాల స్థానంలో సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ ను నియమించిన తర్వాత వీటిని అక్కడి నుంచి ఉపసంహరిస్తారు. దాదాపుగా 100 సీఏపీఎఫ్ కంపెనీలు వెంటనే తాము కార్యకలాపాలు నిర్వహించే బేస్ లోకేషన్‌కు వెళ్లాల్సిందిగా ఆదేశాలు వెళ్లాయి.
అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌కు పెద్ద సంఖ్యలో బలగాలను పంపించిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని నెలలుగా అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న హోం మంత్రిత్వ శాఖ క్రమక్రమంగా బలగాలను ఉపసంహరించుకుంటోంది. ఇందులో భాగంగా మే నెలలో 10 సీఏపీఎఫ్ కంపెనీల బలగాలను వెనక్కి రప్పించిన సంగతి తెలిసిందే.