భాజపాను గద్దె దించడమే మా లక్ష్యం…

-

ఏపి రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గురువారం మ‌ధ్యాహ్నం కర్ణాటక సిఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయ్యారు. పద్మనాభనగర్‌లోని దేవెగౌడ నివాసానికి చేరుకున్న చంద్రబాబుకు కుమారస్వామి, దేవెగౌడ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేశంలో భాజపాయేతర కూటమి ఏర్పాటుపై వారితో చంద్రబాబు చర్చలు జరిపారు. వీరిమధ్య సుమారు 40 నిమిషాల సమావేశం కొనసాగింది..  ఆ తర్వాత ముగ్గురు నేతలు మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని అన్నారు. జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ మాట్లాడుతూ.. దేశంలోని లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భాజపాయేతర కూటమిపై చంద్రబాబుతో చర్చలు జరిపామని.. కూటమి ఏర్పాటులో కాంగ్రెస్‌ కూడా తమతో కలిసివస్తోందని దేవెగౌడ వివరించారు. కూటమిని మరింత బలోపేతం చేసేందుకు చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు.

కర్ణాటక సీఎం కుమారస్వామి మాట్లాడుతూ…కూటమి ఏర్పాటులో దేవెగౌడ, చంద్రబాబు వ్యూహాలు బాగున్నాయని కుమారస్వామి కొనియాడారు. తెదేపా- జేడీఎస్‌ పాతమిత్రుమేనంటూ పేర్కొన్నారు. తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకుని చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలను వేధిస్తోందని విమర్శించారు. ముఖ్యంగా తాను దేవెగౌడ ఆశీస్సుల కోసమే బెంగళూరు వచ్చానని చంద్రబాబు చెప్పారు. మొదటి నుంచి ఆయనతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని వివరించారు. కూటమి ఏర్పాటుకు ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయని, అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version