జగన్ ఓ ఫేక్ ముఖ్యమంత్రి అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఈరోజు సస్పెన్షన్ కు గురయ్యాక ఆయన మీడియాతో మాట్లాడారు. వరదలు, వర్షాలపై పంట నష్టంపై ప్రభుత్వం గాలి కబుర్లు చెబుతోందని, ఏడాదిలో లక్షా 25 వేల కోట్లు అప్పులు చేశారని అన్నారు. ఎమ్మెల్యే రామానాయుడును ఎద్దేవా చేస్తూ సీఎం మాట్లాడ్డం కరెక్టేనా..? అని ఆయన ప్రశ్నించారు. నా లైఫ్ లో నేనెప్పుడూ వెల్లోకి వెళ్లలేదని, పరిటాల రవి హత్య సందర్భంలో కూడా నేను వెల్లోకి వెళ్లలేదని కానీ రైతుల విషయంలో సీఎం తీరు నచ్చకే భైఠాయించానని అన్నారు.
గాలికొచ్చారు.. గాలికే పోతారు అంటూ అయన జగన్ ని ఉద్దేశించి మాట్లాడడం సంచలనంగా మారింది. ఫేక్ ఫెలోస్ వచ్చి.. రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నారన్న బాబు గాల్లో తిరుగుతూ.. గాలి మాటలు చెప్పే సీఎం జగన్ అని అన్నారు. జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారు.. అలాగే ఇన్పుట్ సబ్సిడీని నాశనం చేస్తున్నారని అన్నారు. ప్రీమీయం చెల్లించకుండా పంటల బీమా వ్యవస్థను నాశనం చేస్తున్నారని, ప్రీమీయం కట్టి ఉంటే.. బీమా వచ్చేది.. కానీ జగన్ చేతకానితనం వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు. నా రాజకీయ అనుభవం అంత లేదు జగన్ వయస్సు.. నాకు చెబుతారా..? ఏ పూనకంలో ప్రజలు ఓటేశారో..? రాష్ట్రం ఇలా అయింది అంటూ ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు.