రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఎటువైపు మొగ్గు చూపుతుందో అన్న డైలమా ఉంది. ముఖ్యంగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకి వైసీపీ మద్దతు ఇస్తుండడంతో, విపక్ష కూటమి తరఫున నిలబడిన యశ్వంత్ సిన్హా వైపు టీడీపీ ఉంటుందా లేదా మోడీ వర్గానికే అండగా ఉంటుందా అన్న డైలామా ఒకటి కొనసాగుతోంది. చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఏపీ కాంగ్రెస్ కూడా టీడీపీని ఇరకాటంలో పెట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తోంది. ఈ తరుణాన రణమా ? శరణమా ? అన్న విధంగానే మాట్లాడుతోంది.
టీడీపీకి సంబంధించి ఇప్పటిదాకా ఎవరికి మద్దతు ఇస్తారు అన్న విషయమై ఎటువంటి స్పష్టతా లేదు. చంద్రబాబు నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా ఇంతవరకూ ఏ సమాచారం లేదు. అతి తక్కువ శాతం ఓటింగ్ ఉన్న టీడీపీ రాష్ట్రపతి ఎన్నికల్లో చూపే ప్రభావం తక్కువే కనుక అసలు టీడీపీ ఎవరికి మద్దతు ఇచ్చినా అది పెద్ద చర్చకు తావివ్వదు. కానీ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ ప్రత్యర్థి పార్టీలు కనుక చెరో పక్షం నిలుస్తాయా లేదా రెండూ కలిసి మోడీ చెప్పిన మాటే వింటాయా అన్న చర్చ ఒకటి నడుస్తోంది.