ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంట నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం వెనక్కు తగ్గకపోవడంతో ఎప్పుడు ఎం జరుగుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రాజకీయంగా ఈ అంశం ఏ మలుపులు తిరుగుతుందో అనే ఉత్కంట అందరిలోనూ ఉంది. రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుండగా,
దానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుంది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రాజధాని మార్పుకి వ్యతిరేకంగా మద్దతు కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజధాని వ్యవహార౦ త్వరలో అసెంబ్లీకి వెళ్లనుంది. రాజధానిపై అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. త్వరలో మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి.
ఇప్పుడు జగన్ ఈ విషయంలో పక్కా వ్యూహంతో వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కడా కూడా విపక్షానికి అవకాశ౦ ఇచ్చే ఆలోచన కూడా ఆయన చేయడం లేదట. బిజెపి కూడా దీనిపై దూకుడు పెంచే అవకాశం ఉన్న నేపధ్యంలో అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలని, రాజధాని మార్పు ఎందుకు అనేది పూర్తిగా వివరించాలని జగన్ భావిస్తున్నారు. ఎవరైనా విపక్ష సభ్యులు అడ్డు తగిలితే వాళ్ళను, స్పీకర్ తక్షణమే సస్పెండ్ చేసే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటికే స్పీకర్ కి పలు సూచనలు కూడా వెళ్లాయని అంటున్నారు. మార్పు తధ్యమని, అడ్డు తగలకుండా ఉంటే మంచిది అనే సంకేతాలను ప్రభుత్వం విపక్షానికి సమావేశాల రోజునే ఇచ్చే ప్రయత్నం చేస్తుందని రాజకీయ పరిశీలకులు కూడా అంటున్నారు. సభలో బలం లేకపోవడంతో చంద్రబాబు ఏమీ చేయలేరని, చంద్రబాబు వాదన కూడా ఇప్పుడు ప్రజలు వినే పరిస్థితులు లేవని అంటున్నారు. రాజధాని మార్పు విషయంలో పరిస్థితి చంద్రబాబు చేతిలో లేదని అంటున్నారు.