అనంతపురం(పుట్టపర్తి): పుట్టపర్తి శ్రీ సత్యసాయి నిలయంలో సత్య సాయిబాబా 99వ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సాయిబాబా సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం జిల్లాలోని బుక్కపట్నంలో గల మారాల జలాశయం వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పైలాన్ ఆవిష్కరించారు.కార్తీక వన సమారాధనకు ముఖ్యమంత్రి హాజరై ఒక మొక్క నాటి అక్కడే అటవీశాఖ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన తిలకించారు. అనంతరం కార్తీక వన భోజనాల్లోనూ పాల్గొన్నారు.
బాబా మనందరి మధ్య లేకపోయినా మనందరిలో ఆయన జీవించి ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉన్నత స్థాయికి చేరాలనుకునే ప్రతి వ్యక్తీ బాబా సూక్తులను, మార్గాలను పాటిస్తే తప్పకుండా గమ్యం చేరుకుంటారని చెప్పారు. సత్యసాయి అనుగ్రహంతోనే పుట్టపర్తికి రాగలమని, బాబా పిలుపుతోనే ఇక్కడికి వచ్చానని చంద్రబాబు తెలిపారు. ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ మహోన్నతమైన అనుభూతిని పొందుతానని, ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లాలనిపించదని, తనకు సమయం దొరికినప్పుడల్లా ఇక్కడకు రావాలనిపిస్తుందని సీఎం చెప్పారు. క్రమశిక్షణలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రపంచ దేశాల్లోని అన్ని సంస్థలకు ఆదర్శంగా నిలిచిందని చంద్రబాబు ప్రశంసించారు.
పార్టీ ఎమ్మెల్యేల సమాచారం నా వద్ద ఉంది
ఈ సందర్భంగా మారాలలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. ఓబుళదేవరచెరువు, అమడగూరు, నల్లమాడ మండలాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించే అవకాశాలు పరిశీలిస్తానన్నారు. అభివృద్ధి చేసిన ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు. కియా మోటర్స్ నుంచి పుట్టపర్తి వరకు డబుల్ రోడ్డు వేస్తామన్నారు. హంద్రీనీవా ద్వారా జిల్లాకు నీరిచ్చి కరువు పారదోలామన్నారు. జగన్, పవన్ బిజేపీకి బినామీలుగా మారారన్నారు. తెలంగాణలో వైసీపీ, జనసేన ఎందుకు పోటీ చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. నాలుగు పార్టీలు నాటకాలు ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌తో కలిసి బిజేపీయేతర పార్టీలతో జట్టు కడుతున్నట్లు చెప్పారు. బిజేపీ తప్పుడు పనులకు ప్రజలంతా తగిన బుద్ధి చెపపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.