ఆయన ఏపీ రాజకీయాల్లో సీనియర్ ఎంపీ, ఎమ్మెల్యే మంత్రి ఇలా ఆయన అన్ని పదవులు చేపట్టారు. జిల్లా రాజకీయాలను తన కనుసైగలతో శాసించారు. ఆయనకు జిల్లాలో తిరుగులేని బంధుత్వాలు ఉన్నాయి. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు సీఎంనే ఎదిరించిన నేతగా పేరుంది. అప్పట్లో ఆయన సొంత జిల్లాతో పాటు తన ప్రాంతమైన ఉత్తరాంధ్రలోనూ పార్టీ వ్యవహారాలు మొత్తం చక్కపెట్టేసేవారు. ఇక ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి తనతో పాటు తన బంధుగణానికి టిక్కుట్లు ఇప్పించుకుని గెలిపించుకున్నారు.
ఈ సారి కూడా ఆ బంధుగణం అంతా గెలిచారు.. జిల్లాలో ప్రతిపక్ష పార్టీ అడ్రస్ లేదు.. ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చింది. అయితే జిల్లాలో అంతా ఆయన బంధువులు, అనుచరగణం హవానే నడుస్తుండడంతో అవినీతి తారాస్థాయిలో ఉందట. చిన్న చిన్న పోస్టులకు కూడా లక్షల్లోనూ డబ్బులు గుంజడం ఓ మైనస్ అయితే… ఇక కింది స్థాయి కార్యకర్తలకు ఇవ్వాల్సిన కాంట్రాక్టులు కూడా సదరు మంత్రి, ఆయన బంధువులు అనుచరులే చేసుకోవడంతో భారీ ఎత్తున ఫిర్యాదులు ఉత్తరాంధ్ర పార్టీ ఇన్‌చార్జ్ విజయసాయిరెడ్డితో పాటు అధిష్టానం వద్దకు వెళ్లిపోయాయి.
జగన్ సైతం ఇప్పటికే రెండు మూడు సార్లు సదరు మంత్రికి హెచ్చరికలు జారీ చేసినా ఎంత మాత్రం ఫలితం లేదని అంటున్నారు. ఇప్పటికే 16 నెలలు గడిచిపోయింది. ఇక ఎంత చెప్పినా ఆయన వినరులే.. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవి నుంచి తప్పించి.. పార్టీ కోసం ఆయనకన్నా ముందు నుంచే కష్టపడుతోన్న మరో సీనియర్ నేతకు ఇద్దాంలే అని జగన్ సైతం అన్నట్టు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే సదరు మంత్రి టార్గెట్‌గా ఇటీవల జగన్ అనుకూల మీడియాలో కూడా వ్యతిరేకత వార్తలు వస్తున్నాయని అంటున్నారు.
ఇక గతంలో కూడా సదరు మంత్రి జగన్‌పై అసెంబ్లీలోనూ, బయటా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయినా జగన్ సామాజిక సమీకరణలు బేరీజు వేసుకుని సదరు నేతకు మంత్రి పదవి ఇస్తే.. ఇప్పుడు పార్టీని నిండా ముంచేస్తున్నారన్న ఆగ్రహంతో ఉన్నారట. సదరు మంత్రికి మంత్రి పదవి మహా అయితే మరో యేడాది మాత్రమే అన్న టాక్ వైసీపీలో షురూ అయ్యింది. ఇక ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల కీలక నేత సైతం సదరు మంత్రిపై ఓ కన్నేసి ఉంచుతున్నారట. సో మొత్తానికి ఆయనకు ఎర్త్ పెట్టే ప్రక్రియ సొంత పార్టీలోనే ప్రారంభమైందంటున్నారు.