దిశ ఘటనలో చితికిపోయిన మరో బతుకు… పైకి వినిపించని ఘోష…!

-

తల్లి తండ్రి లేరు… నా అన్న వాళ్ళు ఎవరూ లేరు… సొంత ఊరు వాడినే ప్రేమించింది. నమ్మింది… తల ఒంచి తాళి కట్టించుకుంది. నమ్మి ఏడు అడుగులు ధైర్యంగా వేసింది… నేడు అనాధగా… గర్భిణిగా మిగిలిపోయింది. ఆ కనపడని వ్యధ… ఆ ఆవేదన సమాజం ఇప్పుడు వినదు. ఆ పాపంలో నీకు కూడా భాగం ఉంటుంది అన్నట్టు నిందలు వేస్తుంది. 20 ఏళ్ళు కూడా రాకుండా సమాజంలో వితంతువు హోదా పొందింది. అత్తా మామల ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం… ఇప్పుడు తనను ఆదరించే వాడు గాని చేర దీసే వాడు గాని ఎవరూ లేరు.

దిశ హత్య కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య పరిస్థితి ఇది. నా భర్తను ఎలా చంపారో నన్ను కూడా అలాగే చంపేయండి… నేను నా భర్త లేకుండా బతకలేను అంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆమె పరిస్థితి మరీ దయనీయం… భర్త చేసిన పనికి… ఆమెను కూడా సమాజం దోషిగా చూస్తుంది. భర్త చేసిన నేరానికి తనది కూడా పాపం అంటుంది సమాజం. ప్రభుత్వాలు సాయం చేయవు… దిశ కి న్యాయం చేసాం అని చెప్పుకునే పోలీసులు ఆమెకు అండగా నిలబడే పరిస్థితి అంతకన్నా లేదు.

నేడు ఆమె ఒంటరిగా సమాజంలో నిలబడి చూస్తుంది. లోకాన్ని కూడా చూడకుండా తండ్రిని కోల్పోయిన బిడ్డతో ఆమె ముందుకి నడవాలి… సమాజానికి, మీడియా కళ్ళకు కనపడని ఒక విషాద గాధ ఆమెది. ఇప్పుడు ఆమెను పోషించే పరిస్థితిలో అత్తా మామలు కూడా లేరు. దిక్కు తోచని స్థితిలో ఆమె జీవితం ఉంది… కనీసం ఆమె రోదన కూడా ఎవరూ వినలేరు. చివరకు నా భర్త శవాన్ని నాకు ఇవ్వండి అంటూ రోడ్డు ఎక్కింది. నిజంగా మానవతా వాదులు అనే వాళ్ళు, పరిణితితో ఆలోచించాలి అని సలహాలు ఇచ్చే వాళ్ళు… ఆమె కోసం ముందుకి వచ్చి… బతికే ఉన్న ఒక ఆడ బిడ్డకు తమ వంతు సాయం అందించాలి అంటూ కోరుతున్నారు. దయచేసి ఆమెకు భర్త పాపాన్ని అంటించి దోషిలా చేయవద్దని కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version