ఖలిస్థానీ వేర్పాటువాది, ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్‌పై కెనడా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే నిజ్జర్ హత్య కేసులో ఇప్పుడు ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్యలో చైనా కుట్ర ఉన్నట్లు బయటపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
నిజ్జర్ హత్యలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) ఏజెంట్ల ప్రేమయం ఉందని స్వతంత్ర బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కెనడా, భారత్ మధ్య విబేధాలు సృష్టించడమే చైనా ఉద్దేశమని.. తైవాన్ విషయంలో చైనా సైనిక వ్యూహానికి అనుగుణంగా ప్రపంచ దేశాల దృష్టి మళ్లించే పథకంలో ఇది భాగమని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న జెన్నిఫర్.. తాజాగా తన సోషల్ మీడియా ఎక్స్(ట్విటర్)లో వీడియో పోస్ట్ చేశారు. అందులో నిజ్జర్ది హత్యనేని.. ఈ హత్యలో సీసీపీ ఏజెంట్ల ప్రేమయం ఉందని ఆరోపించారు.