ఇవాళ సిఎం జగన్ మోహన్ రెడ్డి తో భేటీ అయిన చిరంజీవి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఇక నుంచి చిత్ర పరిశ్రమలోని ఏ ఒక్కరూ కూడా జగన్ సర్కార్ పై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు. త్వరలోనే సమస్యలు సమసిపోతాయమని స్పష్టం చేశారు. ఇవాల్టి సమావేశం సంతృప్తికరంగా జరిగిందని.. గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు కొలిక్కి రాకుండా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇండస్ట్రీ వాయిస్ కూడా వినాలని జగన్ నన్ను ఆహ్వానించారని.. ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్ల సాధక బాధలు వివరించామని పేర్కొన్నారు. అన్ని సానుకూలంగా ఆలకించారని.. సినీ ఇండస్ట్రీ విషయంలో జగన్ స్పందన సంతృప్తినిచ్చిందన్నారు. పైకి కన్పించినంత గ్లామరుగా సినీ ఫీల్డ్ ఉండదు… రెక్కాడితే కాని డొక్కాడని పేదలు ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారని వెల్లడించారు.
థియేటర్ల యజమానులకూ అనేక బాధలు ఉన్నాయని.. హాళ్లని మూసేస్తేనే బెటరే భావనకు కొందరు థియేటర్ యజమానులు ఉన్నారన్నారు చిరు. అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారని.. టిక్కెట్ ధరలపై జారీ చేసిన జీవోను జగన్ పునః పరిశీలిస్తామన్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉండాలని.. ఐదో షో వేసుకునే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామన్నారని చెప్పారు. . ఈ సమావేశం వివరాలను సినీ ఇండస్ట్రీలోని చిన్నా పెద్దలకు కూడా తెలియ చేస్తానని.. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. మరోసారి సీఎం జగనుతో భేటీ అవుతానని ప్రకటన చేశారు.