కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన గవర్నర్, సీఎం కేసీఆర్
టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ కు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని మెహిదీపట్నంలోని నివాసంలో హరికృష్ణ భౌతికకాయాన్ని కేసీఆర్ సందర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కేసీఆర్ తో పాటు డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ, మంత్రి జగదీశ్వర్ రెడ్డి తదితర నాయకులు ఉన్నారు. సీఎం కేసీఆర్ హరికృష్ణ తనయుడు జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చి ఏపీ సీఎం చంద్రబాబుతో రేపటి కార్యక్రమం గురించి చర్చించారు. అంత్యక్రియలకు సంబంధించిన విషయాలను కుటుంబ సభ్యలుతో చర్చించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
కృష్ణుడు మన నుంచి వెళ్లిపోయారు..గవర్నర్
హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన గవర్నర్ నరసింహన్ ..మీడియాతో మాట్లాడుతూ… చైతన్య రథ సారథిగా ఉన్న కృష్ణుడ్ని ఆ హరి మన నుంచి తీసుకెళ్లిపోయారు అని గవర్నర్ నరసింహన్ అన్నారు. హరికృష్ణ సాధు స్వభావి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. గతంలో వారి కుమారుడు జానకిరాం మరణించినప్పుడు ఈ ఇంటికి వచ్చాను..మరల ఇలా రావడం ఎంతో బాధగా ఉందన్నారు.