గంటకు రూ.5.1 లక్షల అద్దెతో ఆ రాష్ట్ర సీఎంకు కొత్త హెలికాప్టర్‌.. విమర్శిస్తున్న నెటిజన్లు..

-

రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హెలికాప్టర్లలో ప్రయాణించడం మామూలే. అధికారిక పర్యటనలతోపాటు పలు ఇతర కార్యక్రమాల కోసం కూడా హెలికాప్టర్లను వాడుతుంటారు. అందుకుగాను ప్రభుత్వాలే డబ్బులు చెల్లిస్తాయి. అయితే హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ మాత్రం కొత్త హెలికాప్టర్‌ను లీజుకు తీసుకోవడం విమర్శలకు దారితీసింది.

హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌ రష్యా నుంచి స్కై వన్‌ కంపెనీకి చెందిన ఎంఐ-171ఎ2 అనే హెలికాప్టర్‌ను లీజుకు తీసుకోనున్నారు. అయితే ఆ హెలికాప్టర్‌ను ముందుగా డీజీసీఏ పరీక్షించి దానికి అనుమతులు ఇస్తుంది. ఈ క్రమంలో ఆ హెలికాప్టర్‌ ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా దాన్ని పరీక్షించనున్నారు. డీజీసీఏ అనుమతి అనంతరం మే నుంచి ఆ హెలికాప్టర్‌ను ఉపయోగించనున్నారు. అయితే అసలే ప్రభుత్వం అప్పులతో దివాళా తీసే దశలో ఉందని, అలాంటిది ఈ సమయంలో అంత ఖర్చు పెట్టి కొత్త హెలికాప్టర్‌ను లీజుకు తీసుకోవడం అవసరమా ? అని ప్రతిపక్ష పార్టీ నేతలతోపాటు సోషల్‌ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సీఎం వ్యవహారశైలి పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న హెలికాప్టర్‌ లో 6 సీట్లే ఉంటాయి. దానికి గంటకు రూ.2 లక్షలు చెల్లిస్తున్నారు. కొత్త హెలికాప్టర్‌లో 24 సీట్లు ఉంటాయి. దీనికి గంటకు రూ.5.1 లక్షలు చెల్లించాలి. 5 ఏళ్ల పాటు కాంట్రాక్ట్‌ ఉంటుంది. పాత హెలికాప్టర్‌కు కాంట్రాక్టు ముగిసిందనే కొత్త హెలికాప్టర్‌ను లీజుకు తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వ అనవసరంగా ఎక్కువ ఖర్చు చేస్తుందని చాలా మంది మండిపడుతున్నారు. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ విమర్శలను ఖండించింది. సీఎం హెలికాప్టర్‌ను వాడనప్పుడు దాన్ని ప్రజా అవసరాల కోసం వినియోగిస్తారని, అందులో ఎక్కువ సీట్లు ఉంటే ఎక్కువ సహాయం అందించేందుకు వీలు కలుగుతుంది తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version