‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడోత్సవాలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ క్రీడా సంబరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు సీఎం జగన్. ఈ క్రీడా పోటీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీయడానికి ఉపయోగపడేలా ఉండాలని సీఎం నిర్దేశించారు. ఈ పోటీల ద్వారా క్రీడాస్ఫూర్తి వెల్లివిరియాలని, పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు భోజన వసతుల విషయంలో ఎలాంటి లోటు రానివ్వరాదని తెలిపారు. క్రీడాకారులకు మంచి భోజనం అందించాలని సూచించారు. ఏపీలోని ప్రముఖ క్రీడాకారులు ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడోత్సవాల్లో భాగం అయ్యేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు వివరించారు.
ఇక, విశాఖలో ఉన్న వైఎస్సార్ స్టేడియంను స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్ తీర్చిదిద్దడంపై దృష్టి సారించాలని అన్నారు. అంతేకాకుండా, ఏపీలో క్రికెట్ అభివృద్ధికి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకొచ్చిందని, తిరుపతి, కడప, విశాఖ, మంగళగిరిలో క్రికెట్ అకాడమీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.