విద్యాశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ నెలాఖరు నాటికి రెండో దశ కింద అన్ని స్కూల్స్‌లో పనులు మొదలు కావాలని, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి పాఠశాలలో టీవీలు ఉండాలన్నారు. బోధన, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మనం పోటీపడుతున్నామని, స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి విద్యా కానుక అందించాలన్నారు. ఆ మేరకు సన్నద్దంగా ఉండాలని, బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్ కాలేజీ లేదా హైస్కూల్ ప్లస్ లేదా కేజీబీవీ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలన్నారు.
సమీక్షా సమావేశంలో రీడ్ ఎలాంగ్ యాప్ పనితీరుని వివరించిన అధికారులు.. ఇప్పటి వరకు సుమారు 57,828 మంది రోజూ ఆ యాప్‌ని వినియోగిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాల పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం తక్కువ రావడం తప్పుగా భావించనక్కర లేదని, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి నెలలోజుల్లోనే మళ్ళీ పరీక్షలు పెట్టి వాటిని కూడా రెగ్యులర్‌గానే పరిగణిస్తామన్నారు. పదో తరగతిలో పాస్ అయిన వారికి కూడా ఏదైనా రెండు సబ్జెక్టులలో బెటర్‌మెంట్ రాసుకోవడానికి అనుమతి ఇస్తున్నామని విద్యాశాఖ అధికారులు వివరించారు.