ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా కింద 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. మార్చి 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 14 నామినేషన్ల పరిశీలన, 16వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే మార్చి 23వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.
అలాగే అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి అధికార వైసిపి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీ-ఫారాలు అందజేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం జగన్ ని కలిశారు. వారికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.