ఏపీలో గత కొన్నిరోజులుగా కురిసిన భారీ వర్షాలకు ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిసర ప్రాంతంలోని వాగులు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలు తమ ఇళ్లను కోల్పోయారు. తీవ్ర ఆస్తినష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. పలుమార్లు ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన సీఎం వైఎస్ జగన్ ఈ రోజు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద బాధిత ప్రాంతాల్లో సమర్థవంతంగా సహాయ పునరావాసం కార్యక్రమాలు జరగాలన్నారు. విమర్శలకు తావులేకుండా చూడాలి.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపత్తుల సమయంలో కలెక్టర్లు సహా, అధికారులకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నాం.. అవసరమైన వనరులను సమకూరుస్తూ మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నాం.. టీఆర్-27 నిధులను సకాలంలో విడుదల చేస్తున్నాం అని తెలిపారు. సహాయ, పునరావాస చర్యలు సమర్థవంతంగా చేపట్టేలా అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా నిలిచింది.. దీని తర్వాత, ఈ పనులు చేయడానికి కొంత సమయం ఇస్తున్నాం.. ఆ తర్వాత నేను వచ్చి ఆయా ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో సహాయ పునరావాస కార్యక్రమాలు ఏరకంగా చేపట్టారో స్వయంగా పరిశీలిస్తున్నాను అని తెలిపారు.