మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాస్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన స్థానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భర్తీ చేయబోతున్నారు. ఈ రెండు స్థానాలను ఆషాఢమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం ప్రారంభంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని సమాచారం. శ్రావణమాసం 21వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. దీంతో 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ రెండు మంత్రి పదవులకు ఎవరికి ఛాన్స్ దక్కతుందునేది ఆసక్తికరంగా మారింది. రాజీనామా చేసిన ఇద్దరు బీసీ సామాజిక వర్గం కావడంతో మళ్లీ ఆ వర్గానికి చెందిన వాళ్లకే అవకాశం ఇస్తారా.. లేక జిల్లాలవారీగా లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటారా అన్నది చూడాలి. అలాగే కేబినెట్ విస్తరణ సందర్భంగా శాఖల్లో కూడా మార్పులు చేర్పులు చేయొచ్చని తెలుస్తోంది.