ఎన్టీఆర్ దారిలోనే జగన్ నడిచారు. ఓ విధంగా ఆయన స్ఫూర్తితోనే ఆత్మ గౌరవ నినాదాన్ని ఢిల్లీ పెద్దల ఎదుట వినిపించారు.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ పాలనకు సంబంధించి ఏ విధాన పరమైన నిర్ణయం తీసుకోవాలన్నా ఎన్టీఆర్ తరువాతే ఎవ్వరైనా !అని అంటారు కొందరు. ఆ విధంగా ఎన్టీఆర్ లో ఉన్న సాహసం, ధైర్యం అన్నవి ఇప్పటి పాలకులకూ అవసరం అన్నది వారి అభిప్రాయం. తెలుగుదేశం పార్టీకి బలమైన పునాది కార్యకర్తల శ్రేణితోనే నిర్మాణం అయింది. సాధ్యం అయింది. అందుకే వాడవాడలా తెలుగుదేశం పార్టీకి ఇవాళ్టికీ అభిమానులు ఉన్నారు. ఓ విధంగా ఆ మహనీయుడి స్ఫూర్తితోనే ఇప్పటికీ కొన్ని కుటుంబాలు ఆ పార్టీని వీడలేకపోతున్నాయి.
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తప్పులు చేసినా, కొన్నిసార్లు స్థానిక నాయకత్వాలు తమను పట్టించుకోకపోయినా ఇవాళ్టికీ సంప్రదాయ రీతిలో ఓటు బ్యాంకు తెలుగుదేశానికి ఉంది. మాస్ లీడర్ ఎన్టీఆర్ అని అనిపించుకునేందుకు ఆ రోజు ఖాకీ దుస్తుల్లో ఉమ్మడి రాష్ట్రం అంతా పర్యటించారు. కొన్ని సార్లు కాషాయ వస్త్రాలు ధరించారు. కొన్ని సార్లు జనం మధ్యే ఉంటూ వారి కష్టాలు తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా ప్రజలే నా దేవుళ్లు సమాజమే నా దేవాలయం అని ఆ రోజు చెప్పారు. ఆ నినాదమే ఇప్పటికీ మర్మోగిపోతోంది.
ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని ఎదిగిన నేతల్లో వైఎస్సార్ ఒకరు. ఆత్మ గౌరవ నినాదంతో వైఎస్సార్ కూడా తెలుగు నేలపై తిరుగులేని ప్రభావం చూపించారు. ఎన్టీఆర్ లో ఉన్న తెలుగుదనాన్ని ముఖ్యంగా వస్త్ర ధారణలో వైఎస్సార్ కడదాకా పాటించారు.
తెలుగు నేలపై పంచె కట్టుతో రాణించిన ఆ ఇద్దరూ తమ తమ పార్టీలకు జవం, జీవం పోశారు. ఓ విధంగా పార్టీలు వేరయినా కొన్ని విషయాల్లో కాంగ్రెస్ నేతలు సైతం అబ్బురపడే విధంగా ఎన్టీఆర్ రాణించారు. పెద్దగా జాతీయ రాజకీయాల్లో అప్పట్లో తెలుగు నేతలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు రాణించేవారు కాదు. కానీ ఎన్టీఆర్ అది తప్పు అని నిరూపించారు.
నేషనల్ ఫ్రంట్ పేరిట కూటమి రాజకీయాలు నడిపారు. ఇక ఆయన మార్గంలోనే ఆయన శిష్యుడు కేసీఆర్ నడిచారు. ఆయన కూడా ఆత్మ గౌరవ నినాదాలనే వినిపించి సక్సెస్ అయ్యారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ మాట చెప్పుకునేందుకు కేసీఆర్ పెద్దగా ఇష్టపడలేదు. ఇక ఎన్టీఆర్ దారిలోనే జగన్ నడిచారు. ఓ విధంగా ఆయన స్ఫూర్తితోనే ఆత్మ గౌరవ నినాదాన్ని ఢిల్లీ పెద్దల ఎదుట వినిపించారు. ఏ విధంగా చూసుకున్నా ఇప్పటి నాయకులకు ఎన్టీఆర్ ఓ స్ఫూర్తిదాత. ఇవాళ ఆయన పుట్టిన్రోజు. శుభాకాంక్షలు చెబుతూ…