కేంద్రంపై సీఎం కేసీఆర్ గుస్సా..? ఇవాళ్టి ప్రెస్‌మీట్‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌..!

-

క‌రోనా వ‌ల్ల న‌ష్ట‌పోయిన దేశంలోని అన్ని రంగాల‌కు ఊతం ఇచ్చేందుకు కేంద్రం రూ.20 ల‌క్ష‌ల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్ర‌క‌టించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ విడ‌త‌ల వారీగా ఆ ప్యాకేజీ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. క‌థ అక్క‌డితో అయిపోయింది. కేంద్రం నేరుగా ప్ర‌జ‌ల‌కే ప్ర‌యోజ‌నాలు క‌ల్పించేలా ప్యాకేజీని రూపొందించింది. రాష్ట్రాల‌కు త‌మ సొంత ప్ర‌యోజ‌నాల కోసం నేరుగా స‌హాయం అందించ‌లేదు. దీంతో అన్ని రాష్ట్రాల సీఎంలు అస‌హ‌నంతో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే కేంద్రం వైఖ‌రి ప‌ట్ల అసంతృప్తి, ఆగ్ర‌హంతో ఉన్నార‌ని తెలిసింది.

రాష్ట్రాల‌ను ఆదుకోవాలంటే కేంద్రం హెలికాప్ట‌ర్ మనీని కురిపించాల‌ని గ‌తంలో కేసీఆర్ అన్నారు. అలాగే క్యూఈ (క్వాంటిటేటివ్ ఈజింగ్‌) ద్వారా రాష్ట్రాల బాండ్ల‌ను ఆర్‌బీఐ కొనుగోలు చేయ‌డం, రుణాల‌ను పొందేందుకు వీలు క‌ల్పించ‌డం, కేంద్రం నుంచి రాష్ట్రాలు తీసుకున్న రుణాల చెల్లింపు విష‌య‌మై 6 నెల‌ల వ‌ర‌కు మార‌టోరియం క‌ల్పించ‌డం, ఎఫ్ఆర్‌బీఎం ద్వారా రుణాల‌ను తీసుకునే ప‌రిమితిని 5 శాతానికి పెంచ‌డం.. వంటి అవ‌కాశాలు క‌ల్పించాల‌ని కూడా కేసీఆర్ అన్నారు. కానీ కేంద్రం వాటిని ప‌ట్టించుకోలేదు. దీంతో రాష్ట్రాల‌కు అస‌లు కేంద్రం ఎలాంటి స‌హాయాన్ని ప్ర‌క‌టించ‌న‌ట్లు అయింది.

అయితే ప‌న్నుల్లో వాటాల‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించినా.. నిజానికి అవి రాష్ట్రాల‌కు రావ‌ల్సిన‌వే.. కేంద్రం కొత్త‌గా ఇచ్చేది ఏమీ లేదు. అలాగే ఎఫ్ఆర్‌బీఎం ద్వారా రుణ ప‌రిమితిని 5 శాతానికి పెంచినా.. కేంద్రం సూచించిన సంస్క‌ర‌ణ‌ల‌ను అమ‌లు చేస్తేనే ఆ 5 శాతం రుణ ప‌రిమితి వ‌ర్తిస్తుంది. దీంతో రాష్ట్ర‌ప్ర‌భుత్వాలకు ఈ విష‌యంలో కేంద్రం సంస్క‌ర‌ణ‌ల‌ను అమ‌లు చేయ‌డం త‌ప్ప మ‌రొక గత్యంత‌రం క‌నిపించ‌డం లేదు. అయితే వీటి గురించి ప‌క్క‌న పెడితే.. ఇప్ప‌టికే అధిక శాతం ఆదాయం కోల్పోయి తీవ్ర‌మైన న‌ష్టాలలో కూరుకుపోయిన రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు స‌హాయం రూపంలో కేంద్రం ఒక్క పైసా విదిల్చ‌లేదు. దీంతో సీఎం కేసీఆర్ ఈ విష‌యంపై తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. కేంద్రం అస‌లు రాష్ట్రాల‌ను ఆదుకోక‌పోతే ఎలా.. అన్న భావ‌న‌లో కేసీఆర్ ఇంత‌కు ముందునుంచే వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఇక కేంద్రం ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త ఇవ్వ‌డంతో కేసీఆర్ దీనిపై ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ క్ర‌మంలోనే నేటి కేబినెట్ స‌మావేశం అనంత‌రం కేసీఆర్ ఏం మాట్లాడ‌తారా.. అని ప్ర‌జ‌లు ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రాల‌కు కేంద్రం స‌హాయం చేయ‌క‌పోవ‌డంపైనే కేసీఆర్ ఇవాళ్టి ప్రెస్‌మీట్‌లో ప్ర‌ధానంగా మాట్లాడ‌‌నున్నార‌ని స‌మాచారం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version