మంచి పని ఎవరు చేసిన మెచ్చుకునే మనస్తత్వం గల వ్యక్తిగా తెరాస అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించుకున్నారు. శాసన సభ సమావేశాల చివరి రోజు సందర్భంగా ఆయన మట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం కంటే ఆరోగ్య శ్రీ ఎన్నో రెట్లు మెరుగైందన్నారు. ఆయుష్మాన్ భారత్ కంటే రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ వల్ల అధిక శాతం మందికి ప్రయోజనం చేకూరే విధంగా ఉందన్నారు. అందుకే తెరాస ప్రభుత్వంలోనూ నాలుగున్నరేళ్లుగా ఆరోగ్య శ్రీని యథాతథంగా అమలు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. గొప్ప పథకాన్ని అభినందించడానికి తనకు ఎలాంటి భేషజాలు లేవని ఆయన చెప్పుకొచ్చారు. ఆరోగ్యశ్రీ బాగున్నందునే కేంద్రం అమలు చేస్తున్నఆరోగ్య పథకంలో తెలంగాణ చేరలేదని తెలిపారు.
కంటివెలుగే నిదర్శం..
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు పథకాన్ని సునేత్ర పేరుతో ఇతర రాష్ట్రాలు అమలు చేసేందుకు ప్రయత్నాలు చేయడమే తెరాస ప్రభుత్వ పనితీరుని తెలుపుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరలో చెవి, ముక్కు, గొంతు పరీక్షల శిబిరాలు కూడా నిర్వహించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు