ఫూలే ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకం – సీఎం కేసీఆర్‌

-

ఈ దేశంలో మనుషులంతా అన్ని రంగాల్లో సమానత్వంతో జీవించాలని, ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని ధారపోసిన భారతీయ సామాజిక తత్వవేత్త, మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమేనని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఈ దేశానికి ఫూలే చేసిన సేవలు, త్యాగాలను సీఎం స్మరించుకున్నారు. వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా, దళిత, గిరిజన, బహుజన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా జ్యోతిబా ఫూలే దాదాపు రెండు వందలం ఏండ్ల క్రితమే కార్యాచరణ చేపట్టారని సీఎం అన్నారు.

వారు అనుసరించిన సామాజిక సమానత్వ పంథా, నాటి భారతీయ సమాజంలో కొనసాగుతున్న సాంప్రదాయ సామాజిక విలువలను, వ్యవస్థలను సమూలంగా మార్చివేసేందుకు బాటలు వేసిందని సీఎం తెలిపారు. గుణాత్మక మార్పు దిశగా.. దేశంలోని స్త్రీలు, దళిత బహుజనులు ఉద్యమించేలా ఫూలే కార్యాచరణ పురికొల్పిందని సీఎం అన్నారు.మహాత్మా ఫూలేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా తన గురువుగా ప్రకటించుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. జ్యోతిరావు ఫూలే వంటి మహనీయుల ఆశయాలను నెరవేర్చేదిశగా తెలంగాణ ప్రభుత్వం తన ప్రాధాన్యతాక్రమాన్ని రూపొందించుకుని అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణను అమలు చేస్తున్నదని సీఎం అన్నారు.

జ్యోతిబా ఫూలే అందించిన స్ఫూర్తితో ‘వికాసమే వివక్షకు విరుగుడు’ అనే విధానాన్ని అనుసరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం పాటుపడుతున్నదని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నేడు తెలంగాణలోని దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలు, మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధించి సామాజిక సమానత్వ దిశగా పురోగమించాయని సీఎం పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version