బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య రోజు రోజుకు మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా.. వికారాబాద్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ వికారాబాద్ కలెక్టరేట్ ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట మీద ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగంపై సెటైర్లు వేశారు. తలకు రుమాలు కట్టి డైలాగులు చెప్తే సరిపోతదా? దేశానికి ఉపయోగపడే ఒక్క మాటైనా చెప్పారా? అంటూ ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్ . వికారాబాద్ సభలో ఈ అంశంపై మాట్లాడిన కేసీఆర్.. ‘‘అధికారంలో ఉన్నా కూడా మోదీ ఇంతకాలం ఏం చెయ్యలేదు. మిగతా రెండేళ్ల కోసమైనా ఏమైనా చెప్తారని నేను కూడా ప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసంగం విన్నా. దేశానికి ఉపయోగపడే ఒక్క మాటైనా చెప్పారా?’’ అని నిలదీశారు సీఎం కేసీఆర్.
‘‘నెత్తిమీద రుమాలు కట్టి వేషం వేసి, డైలాగులు చెప్పడం తప్ప దేశానికి ఒక్క మంచి మాట చెప్పారా? అందుకే చెప్తున్నా అందరం చైతన్యవంతులం కావాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో మనం ఎంత బాగున్నా కేంద్రంలో ప్రభుత్వం సరిగా లేకపోతే అభివృద్ధి అంతగా జరగదని, కాబట్టి అక్కడ కూడా మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామన్నారు. దేశ పరిస్థితి దిగజారుతోందని, నిరుద్యోగం పెరుగుతోంది. రూపాయి విలువ పడిపోతోంది. కాబట్టి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి, మంచి ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మనందరం భాగస్వాములం కావాలని చెప్తున్నానన్నారు సీఎం కేసీఆర్.