రాజకీయాల్లో ఎప్పటికప్పుడు తన బలాన్ని అంచనా వేసుకునే నేతల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుతం ఆయన జాతీయస్థాయిలో పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఇది అంత తేలిక విషయం కాదు. తనున్న రాష్ట్రంలో తనకు మద్దతుగా నిలిచే గళాలు.. లేకపోతే.. జాతీయ స్థాయిలో నిలదొక్కుకోవడం అంత తేలికకాదు. ఇంట గెలిస్తేనే.. రచ్చ గెలుపునకు ఓ సార్ధకత ఉంటుంది. బహుశ ఈ సూత్రాన్ని పాటిస్తున్నారో.. ఏమో తెలియదు కానీ.. కేసీఆర్‌లో మాత్రం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
నిన్న మొన్నటి వరకు ఉద్యోగులపై తీవ్రస్థాయిలో ఫైరైన కేసీఆర్.. కరోనా వంక చూపించి వారి జీతాలను కూడా కోసేశారు. అదేసమయంలో కొందరి అధికారులు, ఉద్యోగుల అధికారాలకు కూడా కత్తెర వేశారు. దీంతో కేసీఆర్‌పై వ్యతిరేకత ప్రబలింది. ఈ నేపథ్యంలోనే వారిని మచ్చిక చేసుకునేందుకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో అనూహ్యంగా వారికి అనుకూలంగా చర్యలు తీసుకుంటామని, సన్మానం చేసి మరీ .. ఇంటి కి పంపిస్తామని ప్రకటించారు. దీంతో అప్పటి వరకు ఉన్న వ్యతిరేకత పోయి.. ఉద్యోగుల్లో ఇప్పుడు కేసీఆర్ దేవుడయ్యారు. ఇక, ఇప్పుడు తాజాగా మరో లీకును మీడియాకు విడుదల చేశారు కేసీఆర్.
అదే.. ప్రజా గాయకుడు.. గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ బెర్త్‌ను ఖరారు చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే, కేసీఆర్ ఏం చేసినా.. తనకు సానుకూలంగా ఉండేలా చూసుకుంటారనే వాదన నేపథ్యంలో అనేక మంది ప్రజాగాయకులు ఉన్నప్పటికీ.. గోరటి వెంకన్నకే ఎందుకు ఛాన్స్ ఇచ్చారనే వాదన తెరమీదికి వచ్చింది. ఒకటి ఆయన కేసీఆర్‌కు అనుకూలమా అనేది పక్కన పెడితే.. వ్యతిరేకత లేని వ్యక్తి. ఇక, ఇప్పటికే కేసీఆర్‌పై ఉద్యమ నాయకులను పక్కన పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కోదండరాం.. వంటి కీలక యోధులను కేసీఆర్ ఎప్పుడో పక్కన పెట్టారు.
ఈ పరిణామాలతో కేసీఆర్.. తెలంగాణ ఉద్యమాన్ని మరిచిపోయారనే విమర్శలు సోషల్ మీడియాలో చుట్టుముడుతున్నాయి. ఇవి.. రాజకీయంగా ఆయనకు మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక, ఎన్నికల వేళ కూడా తెలంగాణ సెంటిమెంటే పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేయాలంటే.. ప్రజల్లో క్రేజ్ ఉన్న గోరటి వంటివారికి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. ఏదేమైనా.. కేసీఆర్ రూటు మార్చి మళ్లీ ఉద్యోగులను, ఉద్యమకారులను అక్కున చేర్చుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
-vuyyuru subhash