తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలనలో దూకుడు పెంచారు. అటు పార్టీ నేతలతో ఇటు సంక్షేమ పథకాల అమలుపై గత వారం రోజుల నుంచి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇక ఈ నేపథ్యంలో ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్రం లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల పై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు, పోలీస్ శాఖను ఆధునీకరించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల నిషేధం వంటి వాటిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
అలాగే… దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పెచ్చుమీరుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలు నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు సిఎం కేసిఆర్ పోలీస్, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఇక సమావేశానికి హోం మంత్రి మహమూద్ అలీ తో పాటు పోలీస్ ఉన్నతా ధికారులు మరియు జిల్లా పోలీసులు హజరు కానున్నారు.