తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి శుక్రవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విషయంలో ఎవరూ భయపడొద్దని చెప్పారు. ఈ మహమ్మారి విషయంలో ఏ ఒక్కరూ అజాగ్రత్తగా ఉండకూడదని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రులపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్ల విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనాతో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు పోవద్దని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి, టిమ్స్ కలిపి దాదాపు 3 వేల పడకలు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయని కేసీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం ఉండే 5 వేల పడకలను సిద్ధం చేసినట్లు చెప్పారు. అన్ని ఆసుపత్రుల్లో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 10 వేల పడకలు కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా ఉన్నాయని తెలిపారు. అంతేకాక, 1,500 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని, కావాల్సినన్ని పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని సీఎం తెలిపారు.