మహారాష్ట్ర తుల్జాపూర్‌లో కొలువైన తుల్జా భవానీ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం వద్ద అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో భవానీ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు ఆశ్వీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ సర్కోలిలో జరిగిన బీఆర్‌ఎస్ సభలో పాల్గొన్నారు. అక్కడి నుంచి తుల్జాపూర్ ఆలయానికి చేరుకున్నారు. ఉదయం పండరీపురంలోని రుక్మిణీ సమేత విఠలేశ్వరస్వామి వారలను దర్శించుకొని, పట్టువస్త్రాలను సమర్పించారు.
ధర్మన్న సాదుల్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ధర్మన్నను సోలాపూర్ పెద్దన్నగా పిలుచుకుంటారు స్థానికులు. ధర్మన్న సాదుల్ పూర్వీకులు కరీంనగర్ జిల్లా కన్నాపూర్ కి చెందినవారు. వారి కుటుంబం సోలాపూర్ లో స్థిరపడిన తర్వాత ధర్మన్న సాదుల్ రాజకీయంగా ఎదిగారు. సోలాపూర్ మేయర్ గా పనిచేశారు. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున సోలాపూర్ లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. కొన్నాళ్లుగా కాంగ్రెస్ కి దూరంగా ఉంటున్న ధర్మన్న సాదుల్ ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతల్లో ఆయన కూడా కీలకంగా పనిచేస్తున్నారు. ధర్మన్న సాదుల్ కి స్థానికంగా మంచి పట్టు ఉంది, ఆయన కుటుంబానికి స్థానిక పద్మశాలి వర్గంలో మంచి పలుకుబడి ఉంది. అక్కడి రాజకీయాలను ఆయన కేసీఆర్ కి వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో బీఆర్ఎస్ జెండా ఎగిరి తీరుతుందని చెప్పారు ధర్మన్న సాదుల్.