ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే 96 శాతం పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్లకు అభినందనలు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెల్లేది కలెక్టర్లే. కలెక్టర్ల పనితీరే ప్రభుత్వ పనితీరుకు కొలమానం. కలెక్టర్లు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చాం. కానీ కొంతమంది ఇంకా ఆఫీసులలో కూర్చునే పనిచేయాలని భావిస్తున్నారు. సమస్యలు వచ్చినప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మీ పని తీరును మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది.
జనవరి 26 న అంత్యంత ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేయబోతున్నాం. ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని, గొప్పగా పనిచేస్తున్నదన్న నమ్మకం ప్రజలకు కలిగించాలి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారైనా హాస్టల్స్ విజిట్ చేసి రాత్రి బస చేయాలి. మహిళా అధికారులు బాలికల హాస్టల్స్ కు వెళ్లి అక్కడి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపండి. సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు తీసుకోండి. జనవరి 26 తరువాత నేను ఆకస్మిక తనిఖీలు చేస్తా.. నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.