ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో మంత్రి ఆకస్మిక పర్యటన చేపట్టారు.ఈ క్రమంలో ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్‌ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈనెల 7న సమ్మెకు ఆర్టీసీ జేఏసీ పిలుపునివ్వగా.. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు.
సీఎం ఆదేశాల మేరకు 5, 6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామని రవాణా మంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజా పాలన పని చేస్తుందని మంత్రి తెలిపారు. గత పదేళ్లుగా ఆర్టీసీ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని.. నేడు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో వెళ్తున్నదని తెలిపారు.పాత అప్పులు, పాత సీసీఎస్ నిధులు లాంటివి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.